Author

admin

Browsing

ఆడది విలాసవస్తువు కాదు. ఆడవాళ్లని సెక్స్ సింబల్స్‌గానే భావించడం సంస్కారం కాదు… ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాము. ఆ మాటల వెనుక నిజం ఉన్నదనీ మనకు తెలుసు. కానీ నిజంగా మన మెదడు ఆడవాళ్లని, మగవాళ్లని చూసే తీరులో ఏమన్నా మార్పు ఉందా? అన్న అనుమానం వచ్చింది ఓ పరిశోధకుడికి. బెల్జియంకు చెందిన Philippe Bernard అనే ఈ పరిశోధకుడు తనకు వచ్చిన అనుమానాన్ని ఓసారి నిజమో కాదో తేల్చుకోవాలనుకున్నాడు.

మన మెదడు వస్తువులని వేరేగా, మనుషులని వేరేగా గమనిస్తుంది. అందుకు ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక పెన్ను ఉందనుకోండి. అందులోని క్యాప్ మాత్రమే చూపిస్తే…. అది పెన్నుకి సంబంధించిన భాగమని పసిగట్టేస్తాం. అదే ఒక మనిషి ముక్కుని మాత్రమే చూపిస్తే, అది ఎవరితో కనిపెట్టేందుకు చాలా ఇబ్బంది పడతాము. వస్తువులనీ, మనుషులనీ పసిగట్టడంలో మరో తేడా కూడా ఉంది. మనుషులని తిరగేసి చూసినప్పుడు, వారు ఫలానా అని గుర్తించడం కొంచెం కష్టం. కానీ వస్తువులని తిరగేసి చూసినా, మామూములుగా చూసినా… ఇది పెన్ను, ఇది పుస్తకం, ఇది టీవీ అని ఠక్కున చెప్పేయగలుగుతాం.

వస్తువులనీ, మనుషులనీ మెదడు ప్రాసెస్ చేసే తీరునిబట్టి, జనం ఆడవాళ్లని ఎలా చూస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు. ఇందుకోసం తక్కువ దుస్తులలో ఉన్న మోడల్స్ బొమ్మలని ఎన్నుకొన్నారు. వీరిలో మగవారి ఫొటోలు, ఆడవారి ఫొటోలు రెండూ ఉన్నాయి. ఈ ఫొటోలను కొందరికి తిరగేసి చూపించారు. ఆ తర్వాత కాసేపటికి అదే ఫొటోని సరిగ్గా నిలబెట్టి చూపించి… ‘ఇందాక మీరు చూసిన ఫొటోలో వ్యక్తే ఇందులో ఉన్న వ్యక్తీ ఒకరేనా!’ అని అడిగారు.

పరిశోధకులు సైతం ఆశ్చర్యపోయేలా… ప్రేక్షకులు ఆడవారి ఫొటోలను సరిగ్గానే పోల్చుకోగలిగారు. కానీ మగవారి ఫొటోలని పోల్చుకోవడంలో కాస్త ఇబ్బంది పడ్డారు. అంటే! ఆడవారిని వస్తువులుగానూ, మగవారిని మనుషులుగానూ గుర్తిస్తున్నారన్నమాట. ఇలా గుర్తించినవారిలో ఆడవారు, మగవారు ఒకేవిధంగా తప్పు చేయడం మరో విచిత్రం! ఈ వివక్ష కేవలం ప్రకటనలో కనిపించే మహిళల పట్లేనా లేకపోతే, మన నిజజీవితంలో ఎదురుపడే ప్రతి ఆడవారినీ మనం వస్తువులుగానే చూస్తున్నామా అని తేల్చేందుకు త్వరలోనే మరో పరిశోధన చేపట్టనున్నారట.

Philippe Bernard చేసిన ఈ పరిశోధన ఫలితం కాస్త బాధ కలిగించేదే! అయితే తరతరాలుగా మన సమాజం ఆడవారిని చూస్తున్న తీరు వల్లే, మన మెదడు కూడా ఇలా మారిపోయి ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. మరి దీని పర్యవసానం ఏమిటో !!!

మహాత్మాగాంధి గురించి చాలామందికి చాలా విషయాలు తెలుసు. కానీ ఆయనది ఎడమ చేతి వాటం అన్న విషయం తెలుసా! సచిన్‌ టెండుల్కర్‌ని క్రికెట్‌ ప్రపంచం దేవుడిగా ఆరాధిస్తుంది. ఆయన కుడిచేతితో బ్యాటింగ్‌ చేసినా… స్వతహాగా ఎడమచేతి వాటం ఉన్న మనిషన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఎడమచేతి వాటం ఉన్న ప్రసిద్ధుల గురించి చెప్పుకోవడం మొదలుపెడితే… ఆ జాబితా చాలా పెద్దదిగానే ఉంటుంది. కానీ అలా కొందరికి మాత్రమే ఎడమచేతి వాటం ఉండటం వెనక కారణం ఏమిటి?

మన నాగరికత అంతా కుడిచేతి వాటానికి అనుకూలంగా కనిపిస్తుంది. కారు దగ్గర నుంచీ కత్తెర దాకా ప్రపంచం అంతా కుడిచేతివారికే అనుకూలంగా ఉంటుంది. ఎడమచేతి వాటం ఉన్నవారిని పరిశుభ్రత లేనివారుగానూ, వింతమనుషులుగానూ భావించడమూ కనిపిస్తుంది. ఇప్పుడంటే ఫర్వాలేదు కానీ…. ఒకప్పుడు ఎడమచేతివారిని మంత్రగాళ్లుగా, సైతానుకి ప్రతిరూపాలుగా భావించేవారట. అలా ఎడమచేతి వాటం ఉన్నవారిని తగలబెట్టిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయని అంటారు.

ఇంగ్లీషులో sinister అనే పదం ఉంది. దుష్టబుద్ధి కల మనిషి అని ఈ పదానికి అర్థం. అసలు ఈ పదమే sinistra అనే లాటిన్ పదం నుంచి వచ్చిందట. అంటే ఎడమచేయి అని అర్థం. దీనిబట్టి జనం ఎడమచేతి వాటం ఉన్నవారిని ఎలా అపార్థం చేసుకునేవారో గ్రహించవచ్చు. హిందూ సంప్రదాయంలో కూడా తంత్రాలతో కూడిన ఆచారాలను ‘వామాచారం’ అని పిలవడం గమనించవచ్చు.

ఎడమచేతి వాటానికి కారణం జన్యువులు అన్న అనుమానం ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే! దీనికి కారణం అయిన జన్యువులని ఆ మధ్య కనిపెట్టామని కూడా శాస్త్రవేత్తలు ప్రకటించారు. PCSK6 అనే జన్యువులో మార్పు కారణంగానే కొందరు ఎడమచేతి వాటంతో పుడతారని తేల్చారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడే… అతనిది కుడిచేతివాటమా, ఎడమచేతివాటమా అన్నది పసిగట్టేయవచ్చని చెబుతున్నారు.

ఎడమచేతి వాటం ఉన్నవారు ఈ ప్రపంచంలో పదిశాతమే ఉంటారు. ఒకవేళ జన్యుపరమైన కారణాలు ఉంటే ఈ నిష్పత్తి సరిసమానంగా ఉండవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. దీనికి మన నాగరికతే కారణం అంటున్నారు. మనిషి సంఘజీవి. సాటి మనుషులతో కలిసి పనిచేస్తేనే అతని పని జరుగుతుంది, సమాజమూ ముందుకు నడుస్తుంది. ఈ క్రమంలో అతను తయారుచేసుకునే పరికరాలు అన్నీ కూడా కుడి చేతివాటం వారికే అనుకూలంగా ఉండేలా చూసుకున్నాడు. అలా నిదానంగా ఎడమచేతివాటాన్ని నిరుత్సాహపరుస్తూ వచ్చింది సమాజం. దాంతో క్రమంగా ఎడమచేతి వాటం ఉండేవారి సంఖ్య తగ్గిపోయింది. ఈలోగా భాషకి లిపి కూడా మొదలైంది. ఆ లిపి కూడా కుడిచేతి వాటంవారికే అనుకూలంగా రావడంతో… కుడిచేతివారిదే పైచేయిగా మారిపోయింది.

ఈ ప్రపంచం అంతా కుడిచేతివారికే అనుకూలంగా ఉంటుందన్న విషయంలో అనుమానమే లేదు. కానీ ఇది ఒకరకంగా ఎడమచేతివారికి అదృష్టం కూడా! మిగతావారికి భిన్నంగా ఉండటం వల్ల, కొన్ని పోటీలలో ఎడమచేతి వాటం గలవారికి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు బేస్‌బాల్‌ ఆటనే తీసుకోండి. బేస్‌బాల్ ఆటగాడికి కనుక ఎడమచేతి వాటం ఉంటే అతని ఆట తీరుని పసిగట్టడం, శత్రువులకి అసాధ్యంగా మారిపోతుంది. ఈ తరహా లాభాన్ని negative frequency-dependent selection అంటారు. పైగా ఎడమచేతి వాటం ఉన్నవారు ఇతరులకంటే తెలివిగా ఉంటారనీ, వీరిలో సృజన ఎక్కువగా ఉంటుందని కూడా అంటారు.

మెదడు ఓ గొప్ప అవయవం. ఒక సూపర్‌ కంప్యూటర్‌కి ఉండేంత సామర్థ్యం మన మెదడుకి ఉంటుంది. కానీ ఆ మెదడుకి కూడా కష్టాలు వస్తాయి. రోజులు గడిచేకొద్దీ అందులోని కణాలు తగ్గిపోతాయి. ఫలితంగా మతిమరపు రావడం, ఏకాగ్రత తగ్గిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇది ఒకోసారి అల్జీమర్స్‌ వంటి సమస్యలకి కూడా దారితీస్తుంది. కానీ మెదడులోని కణాలు నిర్వీర్యం అయిపోకుండా ఇప్పుడు ఓ ఉపాయం దొరికేసింది అంటున్నారు పరిశోధకులు.

ల్యూటెన్ (Lutein). ఈ పదార్థం గురించి మనం పెద్దగా విని ఉండం కదా! ఆకుకూరలు, క్యారెట్లు, గుడ్లు వంటి అతికొద్ది పదార్థాలలో కనిపించే ఒక ముఖ్యమైన పోషకం ఈ ల్యూటెన్. ఇప్పటివరకూ ఈ ల్యూటెన్ మన కళ్లకి చాలా మంచిదని చెబుతూ వస్తున్నారు. క్యారెట్లు తినడం వల్ల కళ్లకి మంచిదని పెద్దలు చెప్పడానికి…. అందులో విటమిన్ Aతో పాటుగా ల్యూటెన్ ఉండటమే కారణం.

ఈ ల్యూటెన్ వల్ల మెదడుకి కూడా ఏమన్నా మేలు జరుగుతుందా అన్న ఆలోచన వచ్చింది పరిశోధకులకి. దాంతో 25 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారిని ఓ 60 మందిని ఎన్నుకొన్నారు. ల్యూటెన్ మన కంట్లోని కణాలలో పోగవుతూ ఉంటుంది. దాంతో కంట్లో ల్యూటెన్ నిల్వలు అధికంగా ఉండేవారి మెదడు ఏ మేరకు చురుగ్గా ఉంటోందో గమనించే ప్రయత్నం చేశారు.

ఆశ్చర్యంగా ల్యూటెన్‌ ఎక్కువగా ఉన్నవారి మెదడు చాలా చురుగ్గా పనిచేయడాన్ని గమనించారు. అభ్యర్థుల మెదడుకి ఎలక్ట్రోడ్లను తగిలించి చూసినప్పుడు, ల్యూటెన్ అధికంగా ఉండేవారిలో ఏకాగ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. తక్కువ ల్యూటెన్‌ ఉన్న పెద్దవాళ్ల మెదడు, వయసులో ఉన్నవారితో సమానంగా స్పందిస్తోందని గ్రహించారు.

మెదుడ మీద ల్యూటెన్‌ ప్రభావం తేలిపోవడంతో…. మెదడుకి సంబంధించి అనేక సమస్యలకు ల్యూటెన్‌ని మందుగా ఇచ్చే ప్రయత్నాలు మొదలవుతాయని ఆశిస్తున్నారు. వీలైనంతవరకూ ల్యూటెన్‌ అధికంగా ఉండే ఆకుకూరలు, గుడ్లు, చిలగడదుంప, టమాటా, క్యారెట్‌, గుడ్లు, బొప్పాయి, బీన్స్‌… లాంటి పదార్థాలు మన ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడమని చెబుతున్నారు. మన శరీరానికి స్వతహాగా ల్యూటెన్‌ని తయారుచేసుకునే సామర్థ్యం ఉండదు కాబట్టి, అది అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. ఆ కాస్త జాగ్రత్తా కనుక తీసుకుంటే…. వయసు ఎంతగా మీదపడినా మెదడు మాత్రం భద్రంగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.
నిర్జర.

తెలుగువారు గొప్ప పుణ్యం చేసి ఉంటారు. కాకపోతే మరేంటి! దేశమంతా గోవిందా గోవిందా అని తల్చుకుంటూ చేరుకునే ఏడుకొండలు శ్రీనివాసుడు మన దగ్గరే ఉన్నాడు. వైష్ణవులంతా అవతార పురుషునిగా భావించే రాఘవేంద్రుడూ ఇక్కడే ఉన్నాడు. ఈ శ్రావణ బహుళ విదియనాటికి (ఆగస్టు 9), రాఘవేంద్రస్వామివారు సజీవసమాధిని పొంది సరిగ్గా 346 ఏళ్లు కావస్తున్నాయి. ఆ సందర్భంగా స్వామివారి తలపు…

రాఘవేంద్ర స్వామి వారు 1595లో తమిళనాడులోని భువనగిరి అనే గ్రామంలో తిమ్మనభట్టు, గోపికాంబ అనే దంపతులకు జన్మించారు. ఈ దంపతులు వేంకటేశ్వరుని భక్తులు కావడంతో తమ కుమారునికి వెంకటనాథుడు అని పేరు పెట్టారు. వేంకటనాథుడు అక్షరాభ్యాసం నుంచే సకల శాస్త్రాలనూ ఔపోసన పట్టసాగాడు. నాలుగు వేదాలతో సహా ఆధ్మాత్మికలోకంలో వినుతికెక్కిన సకల గ్రంథాల మీదా అతను పట్టు సాధించాడు. యుక్తవయసు వచ్చేసరికి తానే పదిమందికీ బోధించే స్థాయిలో జ్ఞానాన్ని సాధించాడు.

వెంకటనాథుడు తన విద్యను ముగించుకుని ఇంటికి తిరిగివచ్చేసరికి ఆయనకు సరస్వతీబాయితో వివాహం జరిపించారు. వారికి ఓ చక్కని కుమారుడు కూడా జన్మించాడు. అయితే వేంకటనాథడు ఆధ్మాత్మిక గ్రంథాలని కేవలం చదవలేదు. వాటిని మనసారా ఆకళింపు చేసుకున్నాడు. వాటిలో నిత్యం వినిపించే మోక్షమనే పదమే తన లక్ష్యం కావాలనుకున్నాడు. అందుకే కుంబకోణానికి చేరుకుని అక్కడ సుధీంద్ర తీర్థులు అనే పీఠాధిపతి వద్ద శిష్యరికం సాగించాడు.

వేంకటనాథుని జ్ఞానం, వాదనాపటిమ చూసిన సుధీంద్ర తీర్థులు ముగ్థులైపోయారు. ఒకానొక సందర్భంలో ఆయన కూడా రాయలేకపోయిన ఒక ఘట్టాన్ని వేంకటనాథుడు పూరించాడట. ఆ సందర్భంగా గురువుగారు ఆయనకు ‘పరిమళాచార్య’ అన్న బిరుదుని అందించారట. ఇక సుధీంద్ర తీర్థునికి అవసాన దశ రాగానే… తన వారసునిగా వేంకటనాథుడు తప్ప మరో పేరే స్ఫురించలేదు. గురువుగారి వారసత్వాన్ని కొనసాగించేందుకు, వేంకటనాథడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు. తన ఇష్టదైవమైన రాముని పేరుమీదుగా ‘రాఘవేంద్ర తీర్థులు’గా మారి గురువుగారి శ్రీమఠం బాధ్యతలను తలకెత్తుకున్నాడు.

రాఘవేంద్రస్వామి వారు చాలా ఏళ్లు కుంబకోణలోని శ్రీమఠాన్ని నిర్వహించారు. పిదప ధర్మప్రచారం చేస్తూ ఉత్తర దిక్కుగా బయల్దేరారు. స్వామి ఒకో ఊరు దాటుతూ… తన ఉపన్యాసాలతోనూ, తర్కంతోనూ ప్రజలందరినీ భక్తి మార్గానికి మరలిస్తూ సాగారు. ఆ సందర్భంగా ఆయనకు ‘గురుసార్వభౌమ’ అన్న బిరుదు వరించింది. ఇలా సాగుతున్న స్వామివారు కర్ణాటక సరిహద్దులోని పంచముఖికి చేరుకున్నారు. అక్కడ 12 సంవత్సరాలపాటు పంచముఖి ఆంజనేయుని ఉపాసించారట. ఆయన దీక్షకు మెచ్చి ఆ స్వామివారు పంచముఖి రూపంలోనే దర్శనమిచ్చారట.

అక్కడి నుంచి స్వామి ఆదోనికి చేరుకున్నాడు. అప్పట్లో మసూద్‌ఖాన్‌ అనే ముస్లిం రాజు అదోనిని పాలించేవాడు. స్వామివారి మహిమలకు ముగ్ధుడైన మసూద్‌ఖాన్‌, తన రాజ్యంలో స్వామివారికి ఎలాంటి లోటూ ఉండదని హామీ ఇచ్చాడు. స్వామివారు సాక్షాత్తూ ఆ ప్రహ్లాదుని అవతారం అని భక్తులు విశ్వాసం. అందుకు తగినట్లుగానే ప్రహ్లాదుని రాజ్యంలోని భాగమని చెప్పబడుతున్న మాంచాల అనే గ్రాహానికి చేరుకున్నారు రాఘవేంద్రులు. అక్కడే తాను జీవసమాధి చెందబోతున్నట్లు ప్రకటించారు.

1671 శ్రావణ బహుళ విదియనాడు స్వామి వారు సాలగ్రామాల తోడుగా, వేదమంత్రాల సాక్షిగా…. సజీవంగా మాంచాల గ్రామంలోని బృందావనంలోకి ప్రవేశించారు. అదే ఇప్పుడు మంత్రాలయం అన్న పేరుతో పిలవబడుతోంది. తాను బృందావనంలోకి ప్రవేశించినప్పటికీ, 700 ఏళ్లపాటు జీవించే ఉంటానని ఆయన చెప్పారట. అందుకు సాక్ష్యంగా ఇప్పటికీ స్వామివారు పలుభక్తులకు దర్శనమిచ్చినట్లు చెబుతారు. బ్రటిష్‌వారు పాలించే సమయంలో కర్నూలు కలెక్టరుగా విధులు నిర్వహించిన సర్ థామస్ మన్రోకు సైతం స్వామివారు కనిపించినట్లు తెలుస్తోంది.

మధ్వాచార్యులు స్థాపించిన ద్వైతమత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలోనే రాఘవేంద్రులు తన జీవితాన్ని గడిపేశారు. కేవలం ప్రవనచాల ద్వారానే కాకుండా సుధాపరిమళం వంటి అనేక గ్రంథాలను రచించడం ద్వారా మధ్వ సిద్ధాంతాన్ని బలపరిచారు. జ్ఞానాన్ని పలికించడంలోనే కాదు, సరిగమలు వినిపించడంలోనూ స్వామివారు దిట్ట. ఆయన వీణ మోగిస్తుంటే అలౌకికమైన అనుభూతి కలిగేదట. ఇప్పటికీ మంత్రాలయంలోని ఆయన సన్నిధికి చేరుకున్న ప్రతిఒక్కరికీ ఇదే అనుభూతి కలుగుతూ ఉంటుంది.