Archive

September 2019

Browsing

ఆడది విలాసవస్తువు కాదు. ఆడవాళ్లని సెక్స్ సింబల్స్‌గానే భావించడం సంస్కారం కాదు… ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాము. ఆ మాటల వెనుక నిజం ఉన్నదనీ మనకు తెలుసు. కానీ నిజంగా మన మెదడు ఆడవాళ్లని, మగవాళ్లని చూసే తీరులో ఏమన్నా మార్పు ఉందా? అన్న అనుమానం వచ్చింది ఓ పరిశోధకుడికి. బెల్జియంకు చెందిన Philippe Bernard అనే ఈ పరిశోధకుడు తనకు వచ్చిన అనుమానాన్ని ఓసారి నిజమో కాదో తేల్చుకోవాలనుకున్నాడు.

మన మెదడు వస్తువులని వేరేగా, మనుషులని వేరేగా గమనిస్తుంది. అందుకు ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక పెన్ను ఉందనుకోండి. అందులోని క్యాప్ మాత్రమే చూపిస్తే…. అది పెన్నుకి సంబంధించిన భాగమని పసిగట్టేస్తాం. అదే ఒక మనిషి ముక్కుని మాత్రమే చూపిస్తే, అది ఎవరితో కనిపెట్టేందుకు చాలా ఇబ్బంది పడతాము. వస్తువులనీ, మనుషులనీ పసిగట్టడంలో మరో తేడా కూడా ఉంది. మనుషులని తిరగేసి చూసినప్పుడు, వారు ఫలానా అని గుర్తించడం కొంచెం కష్టం. కానీ వస్తువులని తిరగేసి చూసినా, మామూములుగా చూసినా… ఇది పెన్ను, ఇది పుస్తకం, ఇది టీవీ అని ఠక్కున చెప్పేయగలుగుతాం.

వస్తువులనీ, మనుషులనీ మెదడు ప్రాసెస్ చేసే తీరునిబట్టి, జనం ఆడవాళ్లని ఎలా చూస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు. ఇందుకోసం తక్కువ దుస్తులలో ఉన్న మోడల్స్ బొమ్మలని ఎన్నుకొన్నారు. వీరిలో మగవారి ఫొటోలు, ఆడవారి ఫొటోలు రెండూ ఉన్నాయి. ఈ ఫొటోలను కొందరికి తిరగేసి చూపించారు. ఆ తర్వాత కాసేపటికి అదే ఫొటోని సరిగ్గా నిలబెట్టి చూపించి… ‘ఇందాక మీరు చూసిన ఫొటోలో వ్యక్తే ఇందులో ఉన్న వ్యక్తీ ఒకరేనా!’ అని అడిగారు.

పరిశోధకులు సైతం ఆశ్చర్యపోయేలా… ప్రేక్షకులు ఆడవారి ఫొటోలను సరిగ్గానే పోల్చుకోగలిగారు. కానీ మగవారి ఫొటోలని పోల్చుకోవడంలో కాస్త ఇబ్బంది పడ్డారు. అంటే! ఆడవారిని వస్తువులుగానూ, మగవారిని మనుషులుగానూ గుర్తిస్తున్నారన్నమాట. ఇలా గుర్తించినవారిలో ఆడవారు, మగవారు ఒకేవిధంగా తప్పు చేయడం మరో విచిత్రం! ఈ వివక్ష కేవలం ప్రకటనలో కనిపించే మహిళల పట్లేనా లేకపోతే, మన నిజజీవితంలో ఎదురుపడే ప్రతి ఆడవారినీ మనం వస్తువులుగానే చూస్తున్నామా అని తేల్చేందుకు త్వరలోనే మరో పరిశోధన చేపట్టనున్నారట.

Philippe Bernard చేసిన ఈ పరిశోధన ఫలితం కాస్త బాధ కలిగించేదే! అయితే తరతరాలుగా మన సమాజం ఆడవారిని చూస్తున్న తీరు వల్లే, మన మెదడు కూడా ఇలా మారిపోయి ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. మరి దీని పర్యవసానం ఏమిటో !!!

మహాత్మాగాంధి గురించి చాలామందికి చాలా విషయాలు తెలుసు. కానీ ఆయనది ఎడమ చేతి వాటం అన్న విషయం తెలుసా! సచిన్‌ టెండుల్కర్‌ని క్రికెట్‌ ప్రపంచం దేవుడిగా ఆరాధిస్తుంది. ఆయన కుడిచేతితో బ్యాటింగ్‌ చేసినా… స్వతహాగా ఎడమచేతి వాటం ఉన్న మనిషన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఎడమచేతి వాటం ఉన్న ప్రసిద్ధుల గురించి చెప్పుకోవడం మొదలుపెడితే… ఆ జాబితా చాలా పెద్దదిగానే ఉంటుంది. కానీ అలా కొందరికి మాత్రమే ఎడమచేతి వాటం ఉండటం వెనక కారణం ఏమిటి?

మన నాగరికత అంతా కుడిచేతి వాటానికి అనుకూలంగా కనిపిస్తుంది. కారు దగ్గర నుంచీ కత్తెర దాకా ప్రపంచం అంతా కుడిచేతివారికే అనుకూలంగా ఉంటుంది. ఎడమచేతి వాటం ఉన్నవారిని పరిశుభ్రత లేనివారుగానూ, వింతమనుషులుగానూ భావించడమూ కనిపిస్తుంది. ఇప్పుడంటే ఫర్వాలేదు కానీ…. ఒకప్పుడు ఎడమచేతివారిని మంత్రగాళ్లుగా, సైతానుకి ప్రతిరూపాలుగా భావించేవారట. అలా ఎడమచేతి వాటం ఉన్నవారిని తగలబెట్టిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయని అంటారు.

ఇంగ్లీషులో sinister అనే పదం ఉంది. దుష్టబుద్ధి కల మనిషి అని ఈ పదానికి అర్థం. అసలు ఈ పదమే sinistra అనే లాటిన్ పదం నుంచి వచ్చిందట. అంటే ఎడమచేయి అని అర్థం. దీనిబట్టి జనం ఎడమచేతి వాటం ఉన్నవారిని ఎలా అపార్థం చేసుకునేవారో గ్రహించవచ్చు. హిందూ సంప్రదాయంలో కూడా తంత్రాలతో కూడిన ఆచారాలను ‘వామాచారం’ అని పిలవడం గమనించవచ్చు.

ఎడమచేతి వాటానికి కారణం జన్యువులు అన్న అనుమానం ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే! దీనికి కారణం అయిన జన్యువులని ఆ మధ్య కనిపెట్టామని కూడా శాస్త్రవేత్తలు ప్రకటించారు. PCSK6 అనే జన్యువులో మార్పు కారణంగానే కొందరు ఎడమచేతి వాటంతో పుడతారని తేల్చారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడే… అతనిది కుడిచేతివాటమా, ఎడమచేతివాటమా అన్నది పసిగట్టేయవచ్చని చెబుతున్నారు.

ఎడమచేతి వాటం ఉన్నవారు ఈ ప్రపంచంలో పదిశాతమే ఉంటారు. ఒకవేళ జన్యుపరమైన కారణాలు ఉంటే ఈ నిష్పత్తి సరిసమానంగా ఉండవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. దీనికి మన నాగరికతే కారణం అంటున్నారు. మనిషి సంఘజీవి. సాటి మనుషులతో కలిసి పనిచేస్తేనే అతని పని జరుగుతుంది, సమాజమూ ముందుకు నడుస్తుంది. ఈ క్రమంలో అతను తయారుచేసుకునే పరికరాలు అన్నీ కూడా కుడి చేతివాటం వారికే అనుకూలంగా ఉండేలా చూసుకున్నాడు. అలా నిదానంగా ఎడమచేతివాటాన్ని నిరుత్సాహపరుస్తూ వచ్చింది సమాజం. దాంతో క్రమంగా ఎడమచేతి వాటం ఉండేవారి సంఖ్య తగ్గిపోయింది. ఈలోగా భాషకి లిపి కూడా మొదలైంది. ఆ లిపి కూడా కుడిచేతి వాటంవారికే అనుకూలంగా రావడంతో… కుడిచేతివారిదే పైచేయిగా మారిపోయింది.

ఈ ప్రపంచం అంతా కుడిచేతివారికే అనుకూలంగా ఉంటుందన్న విషయంలో అనుమానమే లేదు. కానీ ఇది ఒకరకంగా ఎడమచేతివారికి అదృష్టం కూడా! మిగతావారికి భిన్నంగా ఉండటం వల్ల, కొన్ని పోటీలలో ఎడమచేతి వాటం గలవారికి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు బేస్‌బాల్‌ ఆటనే తీసుకోండి. బేస్‌బాల్ ఆటగాడికి కనుక ఎడమచేతి వాటం ఉంటే అతని ఆట తీరుని పసిగట్టడం, శత్రువులకి అసాధ్యంగా మారిపోతుంది. ఈ తరహా లాభాన్ని negative frequency-dependent selection అంటారు. పైగా ఎడమచేతి వాటం ఉన్నవారు ఇతరులకంటే తెలివిగా ఉంటారనీ, వీరిలో సృజన ఎక్కువగా ఉంటుందని కూడా అంటారు.